భోపాల్: ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. క్లాస్ రూమ్‌లో మద్యం సేవించాడు. అంతేగాక విద్యార్థులతో కూడా మద్యం తాగించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖిర్హాని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లాల్ నవీన్ ప్రతాప్ సింగ్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. శుక్రవారం క్లాస్ రూమ్‌లోకి మద్యం తీసుకుని వచ్చాడు. నేలపై కూర్చొన్న అతడు మద్యం సేవించాడు. అలాగే టీ కప్పుల్లో మద్యం పోసి కొందరు విద్యార్థులతో తాగించాడు. మద్యం తాగే ముందు అందులో నీరు కలుపాలని ఒక స్టూడెంట్‌కు చెప్పాడు. మద్యం ఉన్న కప్పులో నీరు పోయగా ఆ విద్యార్థి దానిని తాగాడు. కాగా, ఉపాధ్యాయుడు నవీన్ ప్రతాప్ సింగ్ తరగతి గదిలో విద్యార్థులతో మద్యం తాగించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడు నవీన్ ప్రతాప్ సింగ్‌ను సస్పెండ్ చేశారు.