ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. రాజస్థాన్ జట్టు మరోమారు చివరి ఓవర్‌లో బోల్తా పడి ఓటమిని చవిచూసింది. మార్కరమ్ (66), ఆయుష్ బదోనని (50) అర్ధ సెంచరీలకు తోడు అబ్దుల్ సమద్ 30 పరుగులతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది.
అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు మాత్రమే చేసి రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్ వరకు విజయం రాజస్థాన్ చేతిలోనే ఉంది. అయినప్పటికీ అనూహ్యంగా ఓటమి పాలైంది. రాజస్థాన్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 20 పరుగులు అవసరం కాగా, హెట్మెయిర్ రెండు ఫోర్లు కొట్టడంతో 11 పరుగులొచ్చాయి. ఇక చివరి ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 9 పరుగులు అవసరం. క్రీజులో హెట్మెయిర్, ధ్రువ్ జురెల్ ఉన్నారు కాబట్టి రాజస్థాన్ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ, లక్నో బౌలర్ అవేష్‌ఖాన్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 6 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టును గెలిపించాడు. తొలి రెండు బంతుల్లో మూడు పరుగులు ఇచ్చిన అవేష్‌ఖాన్ మూడో బంతికి హెట్మెయిర్ (12)ను ఔట్ చేశాడు. ఇక, చివరి మూడు బంతుల్లో వరుసగా 0, 2, 1 పరుగులు ఇవ్వడంతో లక్నో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. గత మ్యాచ్‌లోనూ రాజస్థాన్ ఇలానే చివరి ఓవర్‌లో ఒత్తిడికి గురై ఓటమి పాలైంది. అప్పుడు కూడా చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం కాగా తడబడి 8 పరుగులే చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లింది. సూపర్ ఓవర్‌లో తేలిపోయి ఓటమి చవి చూసింది.
ఇక ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 74, కెప్టెన్ రియాన్ పరాగ్ 39 పరుగులు చేయగా, ఐపీఎల్‌లో తొలిసారి బ్యాట్ పట్టిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. ఇక, చివరి ఓవర్‌లో అత్యద్భుత బౌలింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించిన లక్నో బౌలర్ అవేష్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.