న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. పిల్లలు, వృద్దుల మందులను నాశనం చేయడమే లక్ష్యంగా ఆదేశ రాజధాని కీవ్‌లోని భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు అంటుకుని మందుల నిల్వలు ధ్వంసమయ్యాయి. కుసుమ్ అనే కంపెనీకి చెందిన గోదాముపై ఈ దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. రష్యా కావాలనే ఇండియన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటున్నదని విమర్శించింది. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోదాములపై దాడులు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేసింది. భారత్‌కు తాము మిత్రులమని చెప్పే రష్యా, కావాలనే ఇలా దాడులు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ఉక్రెయిన్‌లోని బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ కూడా రష్యా దాడిని ధ్రువీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఫార్మా కంపెనీ గోడౌన్ పూర్తిగా ధ్వంసమైందన్నారు.