అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాల (టారిఫ్లు) ప్రభావం అగ్రరాజ్య కంపెనీలు, పరిశ్రమలపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో ట్రంప్ ఆర్థిక విధానాలపై స్వదేశంలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అమెరికాలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన కాలిఫోర్నియా ఈ విషయంలో ట్రంప్ పరిపాలనా యంత్రాంగంపై న్యాయపోరాటానికి సిద్ధం కాగా, తాజాగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఛైర్మన్ జోరోమ్ పావెల్ దీనిపై స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్రంప్ టారిఫ్ విధానాలతో అమెరికాలో తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన మండిపడ్డారు. సుంకాల పెంపుతో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ పాలనలో విధానపరమైన మార్పులు ఫెడరల్ రిజర్వు సిస్టమ్ (అమెరికా కేంద్ర బ్యాంకు)ను ముంచేశాయని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.